డీజీపీ కార్యాలయంగా ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్
* 190 ఎకరాల సువిశాల ప్రాంగణం
* పచ్చని కొండల నడుమ ఆహ్లాదకర వాతావరణం

మరికొద్ది గంటల్లో నవ్యాంధ్రప్రదేశ్ ఆవిష్కరించబడనుంది. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి రాజధాని నగరం ఎంపిక ప్రక్రియలో మంగళగిరి బాగా ముందుంది. విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం రాజధాని నగరంగా రూపుదాల్చితే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు... ఏవేవి... ఎక్కడెక్కడ! అన్న చర్చలు సర్వత్రా ఆసక్తిదాయకంగా జరుగుతున్నాయి. నూతన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయమా! లేక విజయవాడ నగరంలోని స్టేట్ గెస్ట్ హౌసా!? అన్న సంశయాలు వుండగా, డీజీపీ కార్యాలయం మాత్రం కచ్చితంగా మంగళగిరిలోనే ఏర్పాటవుతుందని రూఢీగా చెబుతున్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ప్రాంగణాన్నే కొత్త పోలీస్ బాస్ కార్యాలయంగా అధికార వర్గాలు ఎంచుకున్నట్టు సమాచారం. అయితే, ఇది డీజీపీకి తాత్కాలిక కార్యాలయమా! లేక శాశ్వత కార్యాలయంగా స్థిరపడుతుందా అనేది మాత్రం ఇంకా ఇత మిత్థంగా తేలలేదు. దీనికి మరికొంత వ్యవధి పట్టే అవకాశం వున్నప్పటికీ తాత్కాలిక డీజీపీ కార్యాలయంగా మాత్రం మంగళగిరి ఏపీఎస్పీ క్యాంపు నిర్ధారణయిపోయినట్టు చెబుతున్నారు. దీంతో అందరి దృష్టి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ వైపు మళ్లింది.

ప్రభుత్వం డీజీపీ తాత్కాలిక కార్యాలయంగా మంగళగిరి ఏపీఎస్పీ క్యాంపును ఎన్నుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఇది విజయవాడ-గుంటూరు నగరాల మధ్య వుండడం... ప్రత్యేకించి జాతీయ రహదారి వెంబడి సువిశాలమైన ప్రాంగణంలో, పచ్చని కొండల నడుమ హాయిగొలిపే ఆహ్లాదకరమైన వాతావరణంలో వుంది. ఇక్కడి నుంచి విజయవాడ రైల్వే జంక్షన్‌కు, గన్నవరం విమానాశ్రయానికి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. అద్భుతమైన పెరెడ్ గ్రౌండుతోపాటు ప్రత్యేక కృష్ణాజలాల పథకాన్ని కూడా ఏపీఎస్పీ క్యాంపు సొంతం చేసుకుని వుంది. ఇన్ని ప్రత్యేకతలు... మరెన్నో అనుకూలతలతో నిండివున్న విశాలమైన ప్రాంగణం విజయవాడ, గుంటూరు నగరాల్లో మరెక్కడా లభ్యమయ్యే పరిస్థితి లేదు. నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న జాస్తి వెంకట రాముడు శనివారం ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణాన్ని సందర్శించి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడి వాతావరణం సంతృప్తినిచ్చిందని వ్యాఖ్యానించారు. డీజీపీ కార్యాలయం ఏర్పాటుకు ఇది అనువైన ప్రాంతమేనని... అయితే ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుందని ఆయన చెప్పుకురావడం గమనార్హం.

ఎప్పుడో... 1972లో ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ఆవిర్భావానికి వేదికగా మారిన ఈ ప్రాంతం నలభై ఏళ్ల తరువాత ఏకంగా డీజీపీ కార్యాలయంగా రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర పోలీసు శాఖలో ఏపీఎస్పీకి ఎంతో ప్రాధాన్యత వుంది. శాంతిభద్రతల సమస్య, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ కార్యాలయాల రక్షణ వంటి ఎన్నో కీలకమైన అంశాలలో ఏపీఎస్పీ పోలీసులు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం రాష్ట్రంలో 17 ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్లను ఏర్పాటు చేసింది. వీటిలో మంగళగిరి బెటాలియన్ ఆరవది. ఈ బెటాలియన్‌ను 1972లో ఏర్పాటు చేశారు. ఈ బెటాలియన్‌కు తొలి కమాండెంట్‌గా ఎస్‌బీవీ రాజు వ్యవహరించారు. తొలిసారిగా 1972, ఆగస్టు 8వ తేదీన జీవోఎంఎస్ నెం.1157 ద్వారా ఆత్మకూరు పంచాయతీ పరిధిలో సర్వే నెం.403, 403/1, కృష్ణనగర్ పంచాయతీ పరిధిలో సర్వే నెం.372లలో మొత్తం వందెకరాలను బెటాలియన్ కోసం కేటాయించారు. ఆ తరువాత మళ్లీ 1974, సెప్టెంబర్ 12వ తేదీన జీవోఎంఎస్ నెం.455 విడుదల చేస్తూ మరో 81.20 ఎకరాలను కేటాయించారు. తిరిగి 1979, జూన్ 29న మరో 8.68 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌కు బదలాయిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. అంటే మొత్తంగా ఏపీఎస్పీ బెటాలియన్ కింద 189.68 ఎకరాల భూమి వుందన్నమాట. ఇంతటి సువిశాలమైన ప్రాంగణంలో తూర్పు ఈశాన్యంగా కమాండెంట్ క్వార్టర్, బెటాలియన్ అధికారుల క్వార్టర్లు, అతిథిగృహం వున్నాయి. వీటికి సమీపంలోనే పెరెడ్ గ్రౌండు, బెటాలియన్ పరిపాలనా కార్యాలయ భవనం వున్నాయి. ఇక బెటాలియన్‌కు పశ్చిమంగా సిబ్బంది క్వార్టర్లు వున్నాయి. వీటిలో మూడొంతులు పైగా శిథిలం కావడంతో సిబ్బందిని ఏడాది కిందటే అధికారులు ఖాళీ చేయించారు. బెటాలియన్‌కు వెనుకవైపు ఎన్‌డీఆర్ఎఫ్ పదవ పటాలం యాభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది.

డీజీపీ తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా రూపుదిద్దుకోనున్న ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ సమీప భవిష్యత్తులో మరింత అందంగా కనిపించబోతుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 29 మంది డీజీపీలు పనిచేశారు. జూన్ 2 నుంచి ఏర్పాటు కానున్న నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి డీజీపీగా జాస్తి వెంకటరాముడు నియమితులు కానున్నారు. జేవీ రాముడు ప్రస్త్తుతం ఆపరేషన్స్ డీజీగాను, ఆక్టోపస్ ఇన్‌చార్జి డీజీగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు  ....> Anvesh leo

Post a Comment

 
Top