మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ చరిత్ర ___ నేడు..ఫిబ్రవరి 20 నుండి బ్రహ్మోత్సవాలు 'తిరునాళ్ళ' ప్రారంభం
_________________________________________

.......శ్రీ మహావిష్ణువే.. కృతాయుగమున మంగళగిరి కొండపై 'శ్రీపానకాల స్వామి' గా వెలసియున్నారు.ఇక్కడ స్వామివారు స్వయంభువు.మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని 'మంగళాద్రి' గా.. 'తోటాద్రి' గా పురాణాలలో ప్రస్తావించబడినది. ప్రతియేటా పాల్గుణశుధ్ధ ఫౌర్ణమి ముందు రోజు మంగళగిరి క్షేత్రమునందు శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణము జరుగుతుంది. పౌర్ణమి రోజు దివ్యరధోత్సవము 'తిరుణాళ'  నిర్వహించబడుతుంది.'మంగళ' ప్రధాయిని అయిన శ్రీలక్ష్మీదేవి ఇక్కడ ఉన్న పర్వతముపై తపస్సుచేయడం వల్ల ఈక్షేత్రానికి "మంగళగిరి" అను పేరువచ్చినది.

                      శ్రీమహావిష్ణువు..ఉగ్రనరసింహ అవతారము దాల్చి హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత..దేవతలు నరసింహునికి పానకము నైవేధ్యముగా సమర్పించి శాంతింపజేశారని..తదుపరి స్వామి వారు ఈక్షేత్రమునందు
'పానకాలస్వామి' గా వెలిశారని 'స్దల పురాణం' లో వివరించబడినది
                        మంగళగిరి క్షేత్రమునందు ముగ్గురు నరసింహ స్వాములు కొలువై యున్నారు.పర్వత శిఖరాగ్రాన 'గండాల నరసింహస్వామి'..కొండ మధ్యభాగమున 'శ్రీ పానకాల నరసింహస్వామి' దిగువ సన్నిధిన ' శ్రీలక్ష్మీనరసింహ స్వామివారు'  

.                   ద్వాపరయుగమున..పాండవులు అరణ్యవాస సమయాన మంగళగిరి కొండపైన గల శ్రీపానకాలస్వామి వారిని దర్శించుకుని..దిగువ సన్నిధియందు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహాన్ని పాండవ అగ్రజుడు ''ధర్మరాజు''  ప్రతిష్టించాడు.

      ధర్మరాజు ప్రతిష్టించిన ఈవిగ్రహంపైన క్రీ.శ.1510 సంవత్సరములో విజయనగరసామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలవారు గుడికట్టంచి..ముఖమంటపాన్ని కూడా నిర్మించారు. గర్భగుడి,ముఖ మంటపాలను నిర్మించిన తదుపరి 1510 సం.లోనే 11 అంతస్తుల తూర్పు గాలిగోపురంలో 3 అంతస్తులు కూడా నిర్మించి నట్టు ముఖ మంటపానికి కుడివైపున ఉన్న 'ధర్మశాసనము' లో పేర్కొనబడినది. రాయలవారు నిర్మించిన 3 అంతస్తుల గాలిగోపురానికి..8 అంతస్తులు 1807_1809 సంవత్సరాల మధ్య అమరావతి జమీందారైన శ్రీరాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు నిర్మించారు.

                          శ్రీకృష్ణదేవరాయలవారు,వేంకటాద్రినాయుడు గారు 'సమిష్టి' గా నిర్మించిన తూర్పు గాలిగోపురం ఎత్తు153 అడుగులు,వెడల్పు 49 అడుగులు.అంతస్తులు మొత్తం 11. ఈగోపురానికి 11 అంతస్తు పైన శిఖరాగ్రాన 'శ్రీ మల్లాది సుబ్బదాసు' ఇత్తడి కలశాలను ఏర్పాటు చేయించారు

                     మంగళగిరిలోగల శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్ధానానికి సంబందించిన 'పెద్దకోనేరు' దీనినే కళ్యాణ పుష్కరిణి గా వ్యవహరిస్తారు. కొన్ని శతాబ్దాలపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు,  కళ్యాణానికి ఈపెద్దకోనేరు
లోని నీటినే వాడేవారు. ఈపెద్దకోనేరు ను 1558 సంవత్సరములో విజయనగర సామ్రాజ్య రాజు సదాశివరాయల వారి మేనల్లుడు..నాటి కొండవీడు రాజ్య పాలకుడు..తిమ్మ రాజయ్య నిర్మించాడు.ఈవిషయం కూడా శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని 4 అడుగుల ఎత్తున మంటపము ముందున్న చిన్న శాసన స్తంభములో వ్రాయబడి ఉంది.

                  ఇక పానకాలస్వామి  మెట్ల మార్గాన్ని..చెన్నాప్రగడ బలరామదాసు గారు 1890 సంవత్సరములో నిర్మించారు.కొండ దిగువభాగం నుండి పానకాలస్వామి వారి గుడి వరకు ఉన్న మెట్లు మొత్తం 480

              మెట్లమార్గం..వృద్దులకు ఇబ్బందిగా ఉండడం వల్ల..కొండపైకి ఘాట్ రోడ్డు ఏర్పాటుచేశారు.ఈఘాట్ రోడ్ నిర్మాణపనులు10_5_2003 వ తేదీ ప్రారంభమై..29_8_2004 నాటికి పూర్తయ్యాయి.ఈఘాట్ రోడ్డుకు అయిన మొత్తం ఖర్చు 1 కోటి 25 లక్షలరూపాయలు.

            ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు..ఫిబ్రవరి 20 వతేదీ మంగళవారం నుండి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 27వతేదీ పోన్నవాహనం..28 వతేదీ రాత్రి లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణము..మార్చి 1 వ తేదీ మద్యాహ్నము 3 గంటలనుండి స్వామి వారి దివ్యరధోత్సవము ప్రాంభమవుతుంది.తర్వాత 12 రోజులపాటు ఆలయములో ఆలంకారోత్సవాలు నిర్వహించబడతాయి.ఈఅలంకారోత్సవాలలో నరసింహస్వామి వారి " స్ధంభోధ్బవ" అలంకారము ఎంతో వైశిష్ట్యమైన అలంకారము.

Post a Comment

 
Top